ఖచ్చితమైన సక్సెస్ కోసం JEE మెయిన్ 2023 ప్రిపరేషన్ టిప్స్ (JEE Main 2023 Preparation Tips)
జేఈఈ మెయిన్ 2023 కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు మంచి స్టడీ ప్లాన్ కలిగి ఉండడం అవసరం, విద్యార్థులు ఉత్తమంగా ప్రిపేర్ అవ్వడానికి 7 టిప్స్ (JEE Main 2023 Preparation Tips)ఈ ఆర్టికల్ లో పొందవచ్చు.
జేఈఈ మెయిన్ 2023 ( JEE Main 2023) : జేఈఈ మెయిన్ 2023 పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA) రెండు సెషన్స్ లో నిర్వహిస్తుంది. జేఈఈ మెయిన్ 2023 మొదటి సెషన్ పేపర్ 1 పరీక్షలు జనవరి 24,25,29,30,31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో జరగనున్నాయి. జనవరి 28వ తేదీన పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 6 వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు సెషన్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్ పరీక్షలకు అప్లై చేసుకునే విద్యార్థులు అందరూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లోనే వారి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. అయితే జేఈఈ మెయిన్ పరీక్షలకు హాజరు అవ్వాలి అని ఆలస్యంగా నిర్ణయం తీసుకున్న వారు కూడా ఉన్న సమయంలోనే జేఈఈ మెయిన్ 2023 పరీక్షలకు ప్రిపేర్ అవ్వవచ్చు. విద్యార్థులు వారికి ఉన్న సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకుంటే వారు ఇప్పటికీ ఇప్పుడు ప్రిపేర్ అయినా కూడా జేఈఈ మెయిన్ లో మంచి స్కోరు సాధించవచ్చు. విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలకు సిద్ధం అవుతూ ఉంటారు కాబట్టి ఈ ప్రిపరేషన్ జేఈఈ మెయిన్ కు కూడా ఉపయోగపడుతుంది. కొంతమంది విద్యార్థులకు మాత్రం ప్రిపరేషన్ కు ఎక్కువ సమయం కావాల్సి ఉంటుంది. తక్కువ సమయంలో జేఈఈ మెయిన్ పరీక్షలను ఖచ్చితంగా క్రాక్ చెయ్యడానికి విద్యార్థులు ఏం చెయ్యాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
జేఈఈ మెయిన్ 2023 ప్రిపరేషన్ ప్రారంభించే విద్యార్థులకు మొదట వచ్చే డౌట్ ఏంటంటే ఎంత సమయం చదవాలి మరియు ఎంత సిలబస్ చదవాలి ? కాబట్టి మీరు ప్రిపరేషన్ ప్రారంభించే ముందు మీ సిలబస్ గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి. మిమ్మల్ని ఎదుటి వారితో పోల్చుకోకుండా ఒక టాపిక్ అర్థం చేసుకోవడానికి మీకు ఎంత సమయం పడుతుంది అని దానిని బట్టి మీ సొంత టైం టేబుల్ సిద్ధం చేసుకోవాలి.
జేఈఈ మెయిన్ 2023 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ముందు జేఈఈ మెయిన్ పరీక్ష విధానం గురించి తెలుసుకోవాలి, పరీక్షల కోసం బాగా ప్రిపేర్ అవ్వడానికి ఈ ఆర్టికల్ సహాయం చేస్తుంది.
JEE మెయిన్ 2023 పరీక్షా విధానం (JEE Main 2023 Exam Pattern)
జేఈఈ మెయిన్ 2023 పరీక్ష విధానం ఈ క్రింది పట్టిక లో వివరించబడింది, విద్యార్థులు మొత్తం ఆర్టికల్ చదివే ముందు ఈ పట్టిక లో ఉన్న సమాచారం తెలుసుకుంటే ప్రిపరేషన్ సులభంగా ఉంటుంది.
కార్యక్రమం | ముఖ్యాంశాలు |
పరీక్ష మోడ్ | ఆన్‌లైన్ |
విభాగాల సంఖ్య | ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ |
పరీక్ష వ్యవధి | 3 గంటలు (180 నిమిషాలు) |
ప్రశ్నల సంఖ్య | 75 |
ప్రశ్నల రకం | బహుళ ఎంపిక ప్రశ్నలు (MCQలు) |
మొత్తం మార్కులు | 300 మార్కులు |
పేపర్ లాంగ్వేజ్ | అస్సామీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూతోపాటు హిందీ, ఇంగ్లీష్ మరియు గుజరాతీ |
JEE మెయిన్ మార్కింగ్ పథకం | సరైన సమాధానానికి +4 మార్కులు; - తప్పు సమాధానానికి 1 మార్కు |
JEE మెయిన్ 2023 కోసం సిద్ధం కావడానికి మీరు ఏమి చేయాలి? (What Should You Do to Prepare for JEE Main 2023?)
జేఈఈ మెయిన్ 2023 సిలబస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 విధానంలో రూపొందించబడింది. ఈ విధానంలో విద్యార్థుల మీద ఒత్తిడి లేకుండా చూడడానికి ప్రభుత్వం మార్పులు చేసింది. కాబట్టి విద్యార్థులు వారి ప్రిపరేషన్ మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఈ సంవత్సరంలో జేఈఈ మెయిన్ పరీక్షలు రెండు సెషన్స్ లో నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్ 2023 పరీక్షలలో విజయం సాధించడానికి మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివెట్ చేసుకుంటూ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఈ క్రింది అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అయితే విజయం మీ సొంతం అవుతుంది.
- ప్రిపరేషన్ కోసం మీ సొంత ప్లాన్ రూపొందించుకోవాలి.
- జేఈఈ మెయిన్ 2023 సిలబస్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
- టైం మేనేజ్మెంట్
- గత సంవత్సర ప్రశ్న పత్రాలను సాల్వ్ చెయ్యడం.
- ప్రతీ సబ్జెక్టు కు సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి.
- ఎక్కువ సార్లు రివిజన్ చేయడం మరియు సందేహాలను నివృత్తి చేసుకోవాలి.
- ఆరోగ్యమైన అలవాట్లు ఏర్పరుచుకోవాలి.
JEE MAIN 2023లో విజయం సాధించడానికి 7 టిప్స్ (7 Tips for Guaranteed Success in JEE MAIN 2023)
విద్యార్థులు జేఈఈ మెయిన్ 2023 పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి ఈ క్రింద వివరించిన స్టెప్స్ ఫాలో అవ్వాలి
ప్రిపరేషన్ కోసం మీ సొంత ప్లాన్ రూపొందించుకోవాలి.
విద్యార్థులు జేఈఈ మెయిన్ 2023 ప్రిపరేషన్ ప్రారంభించే ముందు ఒక ప్లాన్ రెడీ చేసుకోవాలి. మీరు రెడీ చేసుకున్న ప్లాన్ కు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసేలా ఉండాలి. అలా చెయ్యకుండా ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా వృథానే అవుతుంది. జేఈఈ మెయిన్ పరీక్షలలో ఉండే వేయిటేజీ పై కూడా విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి. ఇంటర్మీడియట్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరాల ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథెమాటిక్స్ సబ్జెక్టుల ఆధారంగానే జేఈఈ మెయిన్ పేపర్ 1లో ప్రశ్నలు ఉంటాయి.
జేఈఈ మెయిన్ 2023 సిలబస్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
జేఈఈ మెయిన్ 2023 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఖచ్చితంగా వారి సిలబస్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి . ఏ టాపిక్ లేదా చాప్టర్ కవర్ చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయి అని గమనించాలి . జేఈఈ మెయిన్ పేపర్ 1 ( బీ.టెక్) సిలబస్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మాథెమాటిక్స్ సబ్జెక్ట్ ల నుండి ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 2A (BArch) లో మాథెమాటిక్స్, జనరల్ ఆప్టిట్యూడ్, డ్రాయింగ్ నుండి ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 2B ( BPlan) లో మాథెమాటిక్స్, జనరల్ ఆప్టిట్యూడ్ మరియు ప్లానింగ్ కు సంబందించిన ప్రశ్నలు ఉంటాయి.
టైం మేనేజ్మెంట్
జేఈఈ మెయిన్ 2023 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు వారి సమయాన్ని సరిగా ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. మీరు రెడీ చేసుకున్న టైం టేబుల్ లేదా స్టడీ ప్లాన్ ప్రకారం సరైన టైం లో ప్రిపేర్ అయితే పరీక్షల ముందు రివిజన్ చేసుకోవడానికి కూడా సమయం లభిస్తుంది. విద్యార్థులు ఏ సబ్జెక్టు కోసం ఎంత సమయం కావాలో తెలుసుకుని దానిని బట్టి వారి ప్లాన్ సిద్దం చేసుకోవాలి. ప్రతీ రోజూ ప్రిపేర్ అయిన టాపిక్ లను లేదా చాప్టర్ లను రోజు చివరిలో రివిజన్ చేసుకోవడం కూడా అవసరం.
గత సంవత్సర ప్రశ్న పత్రాలను సాల్వ్ చెయ్యడం.
విద్యార్థులు జేఈఈ మెయిన్ 2023 పరీక్షకు ప్రిపేర్ అవ్వడానికి గత సంవత్సర ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గత సంవత్సర ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయడం వలన విద్యార్థులకు పరీక్ష విధానం గురించి అర్థం అవుతుంది. అంతే కాకుండా ప్రశ్నలను సులభంగా అర్థం చేసుకోవడం మరియు ప్రశ్నలకు సమాధానాలు వ్రాసే సమయం గురించి కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది. వీటి వలన విద్యార్థులకు ఆత్మవిశ్వాసం మరియు టైం మేనేజ్మెంట్ కూడా అలవాటు అవుతాయి.
ప్రతీ సబ్జెక్టు కు సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి.
జేఈఈ మెయిన్ 2023 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ప్రతీ సబ్జెక్టుకు వారి సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఉదాహరణ కు మాథెమాటిక్స్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు చాప్టర్ ప్రకారంగా ఈక్వేషన్స్ మరియు థియరీ లను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే పరీక్షల సమయంలో రివిజన్ కు ఈ నోట్స్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే మిగతా సబ్జెక్టుల కోసం కూడా ముఖ్యమైన ఫార్ములాలు లేదా బుల్లెట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. పరీక్షల సమయంలో ఈ నోట్స్ క్విక్ రివిజన్ చేసుకోవడానికి సులభంగా ఉంటుంది.
ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి మరియు సందేహాలను నివృత్తి చేసుకోవాలి.
విద్యార్థులు పరీక్షల కోసం చదవడమే కాకుండా చదివిన ప్రతీ టాపిక్ ను రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ సార్లు రివిజన్ చేయడం వలన విద్యార్థులు చదివిన అంశాలను మరిచిపోయే అవకాశం ఉండదు. ఒకవేళ విద్యార్థులు చదువుతున్న సమయంలో లేదా రివిజన్ చేస్తున్న సమయంలో ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే వాటిని సాల్వ్ చేసుకోవాలి. తర్వాత సాల్వ్ చెయ్యొచ్చు అని అశ్రద్ధ చేస్తే ఆ టాపిక్స్ చివరికి కష్టంగా ఉండవచ్చు లేదా సమయం దొరకక పోవచ్చు. అందుకే విద్యార్థులు చదివిన అంశాలను ఒకటికి రెండుసార్లు రివిజన్ చేసుకోవాలి.
ఆరోగ్యమైన అలవాట్లు ఏర్పరుచుకోవాలి.
విద్యార్థులు పైన చెప్పిన అంశాలతో పాటు వారి అలవాట్లను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. రోజూ ఒకే సమయానికి నిద్ర లేవడం, ఒకే సమయానికి పడుకోవడం మరియు తగినంత విశ్రాంతి ఉండేలా చూసుకోవాలి. విద్యార్థులు వారి ఆహారపు అలవాట్ల మీద కూడా శ్రద్ధ వహించాలి, టాపిక్ కు టాపిక్ కు మధ్య చిన్న బ్రేక్ తీసుకుని రిఫ్రెష్ అవ్వాలి.
JEE మెయిన్స్ మరియు ఇతర పరీక్షలకు సంబంధించిన తాజా వార్తలు మరియు నోటిఫికేషన్ కోసం CollegeDekho ని అనుసరించండి.