JEE Main 2023: జేఈఈ మెయిన్ 2023 ఏప్రిల్ సెషన్ వాయిదా పడుతుందా? లేదా?
జేఈఈ మెయిన్ 2023 (JEE Main 2023)సెషన్ 2 పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్ లింక్ ఫిబ్రవరి 10వ తేదీ వరకు అందుబాటులోకి రాలేదు. దీంతో జేఈఈ మెయిన్ 2023 పరీక్షలు వాయిదా పడనున్నాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 పరీక్షలు వాయిదా?JEE Main 2023 Session 2 Exams Postponed?: ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం జాతీయ స్థాయిలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) నిర్వహించడం జరుగుతుంది. ఈ ఏడాది ఇప్పటికే జేఈఈ మెయిన్ 2023 (JEE Main 2023)సెషన్ 1 పరీక్షలు పూర్తయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ మధ్య జరగాలి. ఈ మేరకు జేఈఈ మెయిన్ తుది విడత దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వ తేదీ వరకు ఉంటుందని గతంలోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. కానీ ఫిబ్రవరి 10 వరకు కూడా అప్లికేషన్ సబ్మిషన్‌కు వెబ్‌సైట్‌లో లింకు ఉంచలేదు. దీంతో జేఈఈ సెషన్ -2 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? వాయిదా పడతాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
జేఈఈ మెయిన్ సెషన్-2 కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ముందుగా వెల్లడించిన షెడ్యూల్‌ని అనుసరించడం లేదని, కనీసం ఎందుకిలా జరుగుతుందో ? కూడా తెలియజేయడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొందరు మాత్రం ముందుగా ప్రకటించిన విధంగా పరీక్షలు జరుగుతాయని అంటున్నారు. దీంతో జేఈఈ మెయిన్ 2023 పరీక్షలు వాయిదా పడతాయా..? లేదా..? అని అభ్యర్థులు అయోమయంలో పడ్డారు.
అప్లికేషన్ ప్రాసెస్..
ఇంజనీరింగ్‌లో ప్రవేశాలు పొందేందుకు ఇంటర్ పాసైన అభ్యర్థులు జేఈఈ మెయిన్ 2023 ప్రవేశ పరీక్షకు అప్లై చేసుకోవచ్చు. 12వ తరగతి బోర్డు పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్‌లో ఉన్న విద్యార్థులు JEE మెయిన్ 2023లో వారి స్కోర్ ఆధారంగా IIIT, NIT, కేంద్రీయ నిధులతో కూడిన సాంకేతిక సంస్థలలో ప్రవేశాలు పొందేందుకు అర్హులవుతారు. జేఈఈ మెయిన్ 2023 కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain-nta.nic.inలోకి వెళ్లాలి. ఆ తర్వాత హోంపేజీలోకి వెళ్లి జేఈఈ మెయిన్ సెషన్-2 రిజిస్ట్రేషన్ అనే లింక్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అయి ఆ తర్వాత అప్లికేషన్‌ను ఫిల్ చేయాలి. తర్వాత అభ్యర్థులకు సంబంధించిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. తర్వాత అప్లికేషన్‌ను చెక్ చేసుకుని సబ్మిట్ చేయాలి. అనంతరం అప్లికేషన్ ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. జేఈఈ మెయిన్ 2023 పరీక్షను హిందీ, గుజరాతీ, కన్నడ, అస్సామీ, బెంగాలీ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూతో సహా మొత్తంగా 13 భాషల్లో నిర్వహిస్తున్నారు.