ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేను ఉన్న పరిస్థితిని బట్టి వాడు నా మనసులో ఏం వుందో అర్ధం చేసుకుంటాడు, చాలా సార్లు నా మాటలు కూడా ఎవరికీ అర్థం కావు. కానీ నా మౌనం కూడా వాడికి అర్ధం అవుతుంది ఎందుకంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్.
స్నేహం సాధారణంగానే ప్రారంభం అవుతుంది
చిన్నప్పుడు నుండి బంధువులు అందరూ చెప్పే మాట ఒకటే, చివరికి కొన్ని సార్లు అమ్మ, నాన్నలు చెప్పిన మాటలు కూడా అవే "డబ్బు సంపాదిస్తే అందరూ మన దగ్గరకి వస్తారు" అని. కానీ డబ్బు కాదు కదా అసలు నాకు ఏ విషయం తెలియని రోజుల్లో నా జీవితంలోకి వచ్చాడు. దాదాపు అమ్మ, నాన్నలు నాకు ఎంత కాలంగా తెలుసో వాడు కూడా అంతే కాలంగా తెలుసు. సూటిగా చెప్పాలి అంటే ఊహ తెలిసిన అప్పటి నుండి తెలుసు. అయితే ఏరోజూ మా మధ్య కులం, మతం, డబ్బు ఇలాంటి విషయాల వలన ఇబ్బంది రాలేదు. ఎందుకంటే స్నేహము వీటి అన్నిటికీ అతీతమైనది.
సంతోషంలో అయినా దుఃఖం లో అయినా తోడు స్నేహమే
మన సంతోషం అందరితో పంచుకోగలం ఏమో కానీ బాధ, దుఃఖాన్ని అందరితో పంచుకోలేము. కొన్ని సార్లు మన తల్లి తండ్రులతో కూడా పంచుకోలేము. అలాంటి ప్రతీ కష్టాంలో నాకు తోడుగా ఉన్నది నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. తోడుగా ఉండడం అంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం నా పక్కన ఉండడం కాదు, ఆ కష్టాన్ని వాడికి వచ్చినట్టే భావించే వాడు. ఒక్కోసారి నాకంటే ఎక్కువగా వాడే బాధ పడేవాడు. అమ్మ, నాన్న అందరి ప్రేమ కలిపితే ఎలా ఉంటాడో దానికి అర్ధం మాత్రం నా బెస్ట్ ఫ్రెండ్ అనిపిస్తుంది నా వరకు.
చిన్న చిన్న అపార్ధాలు లేకపోలేదు
ఎంత గొప్ప స్నేహితులు అయినా గొడవలు లేకుండా ఉండరు కదా, మేము కూడా అంతే. నిజానికి చెప్పాలి అంటే ఏ ఒక్క విషయంలోనూ మా అభిరుచులు ఒక్కలాగే ఉండవు. నాకు క్రికెట్ అంటే పిచ్చి, వాడు క్రికెట్ అసలు చూడడు. వాడికి సినిమాలు అంటే ప్రాణం, నాకు సినిమాల మీద పెద్దగా ఆసక్తి ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాల లోనూ ఇద్దరివీ వేరు వేరు అభిప్రాయాలే. అప్పుడప్పుడు వాటి వలన వచ్చే చిన్న చిన్న గొడవలు కూడా సహజమే, అయితే ఒకరిని విడిచి ఒకరు మాత్రం ఉండలేక పోయే వాళ్ళం. తిట్టుకుంటూ అయినా కలిసే ఉండేవాళ్ళం కానీ మా అభిప్రాయ బేధాలు మమ్మల్ని దూరం చేయలేకపోయాయి. సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి అంటారు కదా, బహుశా మేము ఇద్దరం కూడా అంతే. అసలు మీ ఇద్దరికీ ఫ్రెండ్ షిప్ ఎలా కుదిరింది రా అని ప్రశ్నించే వారికి మేము చెప్పే సమాధానం కూడా అదే. కష్టాల్లో మన పక్కనే ఉండేవారు ఎప్పటికీ మనతోనే ఉంటారు అని చెప్పే ఇంగ్లీష్ సామెత ఒకటి ఉంటుంది.ఆ సామెత కు సరైన అర్ధం కూడా నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరే దొరికింది.
ఫ్రెండ్ షిప్ డే అవసరమా ?
ఖచ్చితంగా అవసరమే, అరే పుట్టినరోజు దగ్గర నుండి చనిపోయిన రోజు వరకూ ప్రతీ దానికి ఒక రోజుని కేటాయించగా లేనిది, ప్రపంచంలో ఇంత గొప్పదైన స్నేహానికి ఒక రోజు కేటాయించడం భావ్యమే కదా. హిందువులకు దీపావళి లాగా, క్రిస్టియన్లకు క్రిస్మస్ లాగా, ముస్లింలకు రంజాన్ లాగా స్నేహితులకు ఫ్రెండ్షిప్ డే కూడా పండగే కదా అండి. ప్రపంచంలో తల్లి తండ్రులు లేని ఆనాధలు ఉంటారు కానీ స్నేహితులు లేని వారు మాత్రం ఎవరూ ఉండరు కదా. అదే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉద్యోగం వలనో లేదా వేరే ఏదైనా కారణాల వలనో దూరంగా ఉంటూ ఉంటె సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఫ్రెండ్ షిప్ డే కోసం వారు ఎంతగా ఎదురు చూస్తూ ఉంటారో మాటల్లో చెప్పలేము.
బెస్ట్ ఫ్రెండ్ తో ఉంటే కష్టం కూడా తెలియదు
10వ తరగతి చదువుతున్నప్పుడు అనుకుంటా సరదాగా బయటకు వెళ్తే అక్కడ ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి కూర్చుని నవ్వుకుంటూ ఉన్నారు, ఎంతసేపటికి వారి మాటలు కానీ వారి నవ్వులు కానీ ఆగడం లేదు. అసలు ఏ కష్టం , ఏ బాధ లేనట్టు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉన్నారు. ఉత్సుకత ఆపుకోలేక వారి దగ్గరకు వెళ్లి అన్న మీకు ఏమీ కష్టాలు లేవా అని అడిగేసాను. దానికి వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు అవేమీ గుర్తుకు రావు అన్నారు. నిజమే, మన స్నేహితులతో ఉంటే కష్టాలు కూడా తేలికగా అనిపిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆపదలో ఉన్నప్పుడు ఆప్తమిత్రుడు కంటే గొప్పవారు ఎవరూ లేరు.
ఇవి కూడా చదవండి -
రిపబ్లిక్ డే కోసం వ్యాసం ఎలా వ్రాయాలి ?
ఫ్రెండ్స్ మన నుండి ఏం ఆశిస్తారు?
నిజానికి ఫ్రెండ్స్ మన నుండి ఏమీ ఆశించరు. ఒక వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం అతని గుణాన్ని బట్టి ఇవ్వాలి కానీ అతని దగ్గర ఉన్న ధనాన్ని బట్టి కాదు,
కూటికి పేద అయినా కులానికి పేద కాదు, అని ఒక సామెత ఉండేది. నిజానికి అక్కడ కులం అంటే మనిషి యొక్క వ్యక్తిత్వం. మనిషి వ్యక్తిత్వానికి అంత విలువ ఇచ్చేవారు కాబట్టే ఆ సామెత పుట్టింది. నేటి రోజుల్లో మాత్రం బహుశా ఆ సామెతకు ఉన్నంత ప్రాధాన్యత కూడా మనిషి గుణానికి ఉండడం లేదు.
ఒక వ్యక్తి కోటీశ్వరుడు కాబట్టి అతన్ని గౌరవించి తీరాల్సిందే అన్నట్టు ప్రవర్తిస్తుంది లోకం, విచిత్రం ఏమిటంటే ఎంత ధనవంతుడైనా చివరికి మంచి గుణం గలవారినే గౌరవిస్తాడు. పెద్ద పెద్ద రాజ్యాలు, ఎంతకీ తరగని ధనాగారాలు, రత్న మకుటమైన కోశాగారాలు కలిగిన మహారాజులు సైతం సన్యాసి అయిన బుద్ధుడి పాదాలకు నమస్కరించారు అంటే మంచి గుణం కలిగిన వ్యక్తి ముందు ధనం ఎంత తుచ్చమైనదో అర్ధం అవుతుంది.
ధనం ఎవరి దగ్గరా శాశ్వతంగా ఉండదు. కానీ మనిషి అలవరచుకున్న గుణం ప్రాణం పోయేవరకూ అతనితోనే ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అతని జీవితానికి పునాది లాంటిది, ఆ పునాది ఎంత దృఢంగా ఉండాలంటే ఆ వ్యక్తికి గుణం అంత అవసరం. జీవితానికి అవసరమైన పునాదులను ఎన్నటికీ డబ్బుతో నిర్మించలేము. కేవలం ధనానికి గౌరవం ఇచ్చేవారి ఇంట్లో కూడా జీవితం విలువ చెప్పిన బుద్ధుడు లాంటి ఉన్నతమైన వారిని పూజిస్తారే కానీ డబ్బు సంపాదించి మహాధనవంతులను పూజించరు.
గుణం కలిగిన వారిని పూజించి, ధనం కలిగిన వ్యక్తులకు గౌరవం ఇస్తున్నామంటే తప్పు మనలోనే ఉంది. మన మనఃసాక్షిని మనమే మోసగించుకుంటున్నట్టు. సంపాదించేవరకూ నాన్నకు గౌరవం,వండిపెట్టే వరకూ అమ్మ విలువ,అడిగింది ఇచ్చేవరకూ భర్తకు గౌరవం, చెప్పేది వినేవరకు భార్యకు విలువ. ఇలాగే కొనసాగుతూ పోతే చివరకు మనిషి అనే పదానికి కూడా విలువ లేకుండా పోతుంది. జీవితంలో విలువ ఇవ్వవలసిన వాటికి విలువ ఇచ్చినప్పుడే మన జీవితానికి కూడా విలువ ఉంటుంది, ఆ విలువే లేని రోజు జీవితం పాతాళానికి దిగజారిపోతోంది.
ఫ్రెండ్స్ కూడా అంతే మనిషికి విలువ ఇస్తారు కానీ డబ్బుకి కాదు. డబ్బు కోసం చేసే ఫ్రెండ్షిప్ అసలు అర్ధం లేనిది.
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.
స్నేహం ఒక అద్భుతమైన అనుభూతి. ప్రపంచానికి హద్దులు ఉన్నాయ్ కానీ స్నేహానికి హద్దులు లేవు. ప్రతి వ్యక్తి కష్టాల్లోనూ, సుఖాల్లోనూ తోడుండేవాడు మిత్రుడు. ప్రపంచమంతా మనకి ఎదురుతిరిగినా నిజమైన మిత్రుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. స్నేహానికి వయసుతో సంబంధం లేదు, స్నేహానికి కులాలు, మతాలు, జాతి, రంగు ఏవీ అడ్డం కాదు. ఒక మంచి పుస్తకం ఒక గొప్ప స్నేహితుడితో సమానం అంటారు, ఆలా అనుకుంటే ఒక మంచి స్నేహితుడు గ్రంధాలయంతో సమానం. స్నేహం ఎక్కడైనా మొదలవుతుంది, ఎవరి మధ్యనైనా స్నేహం చిగురిస్తుంది. అమ్మ ప్రేమలాగా స్నేహం కూడా ఆద్యంతం అద్భుతమే. ఎన్నో సరదాలు, ఎన్నెన్నో జ్ఞాపకాలు సృష్టించేది స్నేహమే.
నీ తప్పునూ, నీ తెలివితక్కువ పనులను నీ ముందుంచేవాడే నీకు నిజమైన స్నేహితుడు. - బెంజిమిన్ ఫ్రాంక్లిన్
అన్ని బంధాలలోకి స్నేహ బంధం గొప్పది. ఏమీ ఆశించకుండా కష్టాల్లో తోడుండేవాడు నిజమైన మిత్రుడు మాత్రమే, స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం… అని మధుబాబు గారు వ్రాసిన స్నేహగీతం స్నేహంలోని మాధుర్యం తెలియజేస్తుంది. మహా మహా కవులకైనా స్నేహాన్ని వర్ణించాలి అంటే మాటలు సరిపోవన్న మాట నిజమే. వయసు పెరిగేకొద్దీ స్నేహం బలపడుతూ ఉంటుంది. నలుగురు గొప్ప వ్యక్తుల స్నేహ బృందం ఒక చోట చేరిందంటే వారు పసిపిల్లలతో సమానం. తల్లిదండ్రులు, బంధువులు లేని వ్యక్తులు ఉంటారేమో కానీ మిత్రులు లేని వ్యక్తులు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. స్నేహం లేని జీవితం అసంపూర్ణమే…
వెలుగులో ఒంటరిగా నడిచే కన్నా, చీకటి లో ఓ మంచి మిత్రునితో కలిసి నడవడం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. నిజమైన మిత్రుడు మనం సంతోషం లో ఉన్నప్పుడు పక్కన లేకపోయినా కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తోడుగా నిలుస్తాడు. స్నేహం అంటే రక్త సంబంధం లేని కుటుంబం. జీవితాంతం తోడుండే అనుబంధం. జీవితంలో తల్లితండ్రుల్ని లేదా పిల్లలను ఎంచుకునే అవకాశం ఎవరికీ ఉండదు. కానీ జీవితాంతం తోడుండే స్నేహితులను ఎంచుకునే అవకాశం అందరికి ఉంటుంది.
చివరిగా ఒక మాట మనిషికీ, మనిషికీ మధ్య బంధం ఎందుకు?
మ్యాన్ ఈజ్ ఏ సోషల్ ఏనిమల్..మనిషి నిత్యం తన మాటలనీ, ఆలోచనలనీ, ప్రణాళికనీ, ఓటమినీ, గెలుపునీ, అభిప్రాయాలనీ, అభిరుచులనీ, అలవాట్లనీ, భావాలనీ, బరువునీ, బాధ్యతనీ…….అన్నీ, అన్నీ పంచుకుంటాడు. ఓ సాటి మనిషి కావాలి వెన్నై నిలిచి ఉండడానికి. ప్రణాళిక కి లోట్లు, ఎత్తులని చూసి చెప్పడానికి. ఎద చేసిన బాధని ఎడం పక్కకు త్రోసేయమనే ధైర్యం కావాలి. ఓ మార్గదర్శకుడు కావాలి. ఓ మనుష్యుడు కావాలి. మనుగడ లో దారి తీసే ప్రతీ అడుగులో ప్రతీ అణువులో ఒకడు కావాలి…కావాలా? ప్రశ్నిచుకోండి..జవాబు చెప్తుంది. మీ జీవితం లో నడిచిన వ్యక్తులని వారి బంధాల్నీ చూపించేలా చేస్తుంది.
ఇవి కూడా చదవండి
నూతన సంవత్సరం వ్యాసం వ్రాయడం ఎలా | స్వాతంత్య్ర దినోత్సవం స్పీచ్ |
---|---|
ఉపాధ్యాయ దినోత్సవం వ్యాసం వ్రాయడం ఎలా? | క్రిస్మస్ వ్యాసం వ్రాయడం ఎలా? |
సంక్రాంతి పండగ విశేషాలు, విద్యార్థుల కోసం |
సిమిలర్ ఆర్టికల్స్
TS TET మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాలను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి (TS TET Previous Year Question Papers)
ఉగాది పండుగ విశిష్టత.. పచ్చడిలో ఉన్న ప్రత్యేకతలు (Ugadi Festival in Telugu)
నవంబర్ 14 బాలల దినోత్సవం స్పీచ్ తెలుగులో (Children's Day Speech in Telugu)
సంక్రాంతి పండుగ విశేషాలు (Sankranti Festival Essay in Telugu)
ఏపీ 10వ తరగతి రీవాల్యుయేషన్ 2025కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (AP SSC Revaluation 2025)
TS ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్ష తేదీ షీట్ 2025 (TS Intermediate Practical Exam Date Sheet)- తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ డేట్ షీట్‌ని తనిఖీ చేయండి