ఉపాధ్యాయ దినోత్సవ గొప్పతనం, (Teachers Day Essay in Telugu) విశిష్టతలను ఇక్కడ తెలుసుకోండి

Andaluri Veni

Updated On: August 29, 2024 03:25 PM

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ఉపయోగపడే  మంచి వ్యాసాన్ని (Teachers Day Essay in Telugu) CollegeDekho ఈ ఆర్టికల్‌లో అందించింది.
ఉపాధ్యాయ దినోత్సవ గొప్పతనం, (Teachers Day Essay in Telugu) విశిష్టతలను ఇక్కడ తెలుసుకోండి

తెలుగులో ఉపాధ్యాయ దినోత్సవం వ్యాసం (Teachers Day Essay in Telugu) : ప్రతి వ్యక్తి జీవితంలో ఇంట్లో తల్లిదండ్రులు తర్వాత.. గురువులే ప్రముఖ పాత్రను పోషిస్తారు. మంచి, చెడు చెప్పి... బతుకు బండిని లాగేందుకు అవసరమైన విషయాలను బోధిస్తారు. కొన్నిసార్లు తిట్టి... కొన్ని బుజ్జగించి పాఠాలు నేర్పిస్తారు. ఈ సమాజంలో మన పాత్ర ఏమిటో తెలియజేసి ఓ మంచి మనిషిగా తీర్చిదిద్దుతారు. అదేవిధంగా సమాజంలో మంచి పౌరులని తీర్చిదిద్దే గొప్ప బాధ్యతను ఉపాధ్యాయులు నిర్వహిస్తారు.  అందుకే సమాజంలో వారి పట్ల ప్రత్యేకమైన గౌరవం, అభిమానం ఉంటాయి. తమకు ఓనమాలు నేర్పించిన గురువులను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటారు. అలాంటి గొప్ప ఉపాధ్యాయులను గౌరవించుకోవడానికి ప్రతి ఏడాది మన దేశంలో సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని (Teachers Day 2023) జరుపుకుంటారు.

టీచర్స్ డే అనేది ప్రతి విద్యార్థికి చాలా ముఖ్యమైన రోజు. ప్రతి విద్యార్థి తమ ఉపాధ్యాయులను సత్కరించి, వారి ఆశీస్సులను పొందుతుంటారు. అసలు టీచర్స్ డేని సెప్టెంబర్ 05వ తేదీనే ఎందుకు జరుపుకుంటారు? అనే సందేహం చాలా మంది విద్యార్థుల్లో ఉంటుంది. ఉపాధ్యాయ దినోత్సవానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి (Teachers Day Essay in Telegu) ఇక్కడ అందజేశాం.

పది లైన్లలో ఉపాధ్యాయ దినోత్సవం  (Teacher’s Day Essay 10 Lines)

పది లైన్లలో ఉపాధ్యాయ దినోత్సవానికి సంబంధించిన వివరాలు ఇక్కడ అందించాం.
  • ఉపాధ్యాయుల దినోత్సవం టీచర్లకు 'ధన్యవాదాలు' చెప్పడానికి ప్రత్యేకమైన రోజు.
  • ఇది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న జరుపుకుంటారు.
  • గొప్ప ఉపాధ్యాయుడు, నాయకుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను సత్కరిస్తుంది.
  • విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు కార్డులు, చిన్న, చిన్న బహుమతులు ఇస్తారు.
  • పాఠశాలలు ప్రదర్శనలు, డ్రాయింగ్‌ల వంటి సరదా పోటీలను నిర్వహిస్తారు.
  • ఉపాధ్యాయులు మనకు కొత్త విషయాలను నేర్చుకుని ఎదగడానికి సహకరిస్తారు.
  • ఉపాధ్యాయ దినోత్సవం నాడు మనం వారిని ఎంతగా అభినందిస్తున్నామో చూపిస్తాం.
  • ఇది వేడుకలు, ఆనందంతో నిండిన సంతోషకరమైన రోజు.
  • మన జీవితంలో ఉపాధ్యాయులు ఎంత ముఖ్యమో మనకు గుర్తుంది.
  • ఉపాధ్యాయుల దినోత్సవం వారి కృషికి 'ధన్యవాదాలు' అని చెప్పడానికి ఒక గొప్ప మార్గం.

100 పదాల్లో టీచర్స్ డే ప్రాముఖ్యత  (Teachers Day Essay 100 words)

భారత రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (Sarvepalli Radhakrishnan) పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 5న టీచర్స్ డేగా (Teachers Day) జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. అంతేకాదు ప్రతిష్టాత్మకమైన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో బోధించిన తొలి భారతీయ వ్యక్తి. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. డాక్టర్ రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడుగా రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించేందుకు బాటలు వేశారు. అందుకే ఆయన విద్యార్థుల నుంచి ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆయన ఉపాధ్యాయుడుగా సమాజానికి, దేశానికి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని ఆయన పుట్టిన రోజున టీచర్స్‌ డేని (Teachers Day Essay in Telegu)  నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది. 1962వ సంవత్సరం నుంచి ఇది సంప్రదాయంగా మారింది.

దేశ ప్రగతిలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనదని సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పారు. అంతేకాదు ఎన్నో గొప్ప రచనలతో, మాటలతో ఆయన దేశంలోని ప్రజలను ప్రభావితం చేశారు. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించమని ఆయన పిలుపునిచ్చారు. టీచర్స్ డేకు సంబంధించిన స్పీచ్ (Teachers Day Speech) ఇక్కడ అందజేశాం.

300 పదాల్లో ఉపాధ్యాయ దినోత్సవం విశిష్టత  (Teachers Day Essay 300 words)

తెలుగులో టీచర్స్ డే  ప్రసంగం (Teachers Day Speech in Telugu) : ప్రతి విద్యార్థికి సెప్టెంబర్ 5వ తేదీ చాలా ముఖ్యమైన రోజు. ఆరోజే ఉపాధ్యాయ దినోత్సవం. టీచర్స్ డే సందర్భంగా విద్యార్థులు తమ టీచర్లకు చిరు కానుకలను అందించి గౌరవించుకుంటారు. తమ గురువుల పట్ల తమకున్న అభిమానాన్ని చాటిచెప్పుకుంటారు.  అందుకే మన భారతదేశంలో టీచర్స్ డేకి (Teachers Day Essay in Telegu)  చాలా ప్రాధాన్యత ఉంటుంది.

పాఠశాలలోని ప్రతి విద్యార్థిని రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. ఈ వృత్తిలో రాణించడం అంత తేలికైన విషయం కాదు. విద్యార్థుల్లో భయాలను పోగొట్టి, ఆత్మ విశ్వాసాన్ని నింపి సమాజంలో నిలబెట్టాలి. జ్ఞానాన్నే కాదు విలువలను, ధైర్యాన్ని, స్థైర్యాన్ని వారికి అందించాలి. అదే సమయంలో విద్యార్థులకు క్రమ శిక్షణను అలవాటు చేయాలి.  అంతటి బాధ్యతను భుజాలపై మోసే గురువులు అంటే సమాజంలో ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది.  అలాంటి వ్యక్తులను ఏడాదికోసారి తరగతి గదుల్లో గౌరవించుకునే అవకాశం టీచర్స్ డే రోజు ప్రతి విద్యార్థికి దక్కుతుంది.  ఆరోజున టీచర్లను సత్కరించడమే కాదు, విద్యార్థులు టీచర్లుగా మారి పాఠాలు చెబుతారు. తరగతి గదుల్లో సందడి చేస్తారు.  ఉపాధ్యాయుల్లో ఆనందాన్ని నింపుతారు.

నిజానికి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను (Sarvepalli Radhakrishnan) స్మరించుకుంటూ సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. ఉపాధ్యాయ దినోత్సం అనగానే విద్యార్థులకు మొదట గుర్తుకు రావాల్సిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.  ఉపాధ్యాయ దినోత్సవం రోజున విద్యార్థులు కచ్చితంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి తెలుసుకోవాలి.  డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యాపకుడు, దౌత్యవేత్త, మేధావి, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన వ్యక్తి.  1952 నుంచి 1962 మధ్య ఉపరాష్ట్రపతిగా, 1962 నుంచి 1967 వరకు రాష్ట్రపతిగా ఆయన పని చేశారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ (Sarvepalli Radhakrishnan) 1888వ సంవత్సరంలో తమిళనాడులోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు.  మద్రాస్ యూనివర్సిటీలో ఏంఏ (ఫిలాసఫీ) వరకు చదువుకున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత భారతీయ తత్వశాస్త్రంపై అనేక రచనలు చేశారు. ఎన్నో వ్యాసాలు రాశారు. దాంతో ఆయనెంతో పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకున్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సంవత్సరం 1947లో డాక్టర్ రాధాకృష్ణన్  UNESCOలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. అసాధారణ తెలివి తేటలు, క్రమ శిక్షణ, నిబద్దతత కారణంగా ఆయన్ని ఎన్నో పదవులు వరించాయి. విద్యార్థుల కోసం, భవిష్యత్తు తరాలు ఆయన చాలా పాటుపడ్డారు. ఒక టీచర్‌గా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. విద్యార్థులు అతనిని అమితంగా అభిమానించారు. విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటే ఎంత అభిమానం ఉండేదో తెలుసుకోవాలంటే మైసూర్ మహారాజ కాలేజీలో జరిగిన సంఘటన గురించి తెలుసుకోవాలి.

కొంతకాలంపాటు మైసూర్‌లోని మైసూర్‌లోని మహారాజా కళాశాలలో రాధాకృష్ణన్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అయితే ఆ కాలేజ్ నుంచి ఆయన బదిలీ అయ్యారు. ఆ సమయంలో సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారికి  విద్యార్థులు మరిచిపోలేని విధంగా వీడ్కోలు తెలియజేశారు. మొదట ఓ గుర్రంపై ఆయన్ని ఊరేగించాలనుకున్నారు. దానికి సర్వేపల్లిని బలవంతంగా ఒప్పించారు. అయితే ఆ సమయానికి గుర్రం కనిపించలేదు.   ఆ గుర్రం ఏటో వెళ్లిపోయింది. అప్పుడు విద్యార్థులు తమ భుజాలపై రాధాకృష్ణన్‌ని  ఊరేగింపుగా రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్లారు. అంతగా విద్యార్థులు సర్వేపల్లిని ఇష్టపడ్డారు. ఒక గురువుగా విద్యార్థుల పట్ల ఆయన అంతే ప్రేమతో ఉండేవారు. అందుకే  సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 05వ తేదీన విద్యార్థులు టీచర్స్‌ డేగా నిర్వహించుకుంటారు.

500 పదాల్లో ఉపాధ్యాయ దినోత్సవం గొప్పతనం  (Teachers Day Essay 500 words)

ప్రతి మనిషి చదువు చాలా అవసరం. మనిషి జీవించడానికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో విద్య కూడా అంతే ముఖ్యం. దేశం ప్రగతి బాటలో నడవడానికి, ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడ్డానికి విద్యే మూలం. అందుకే ఆ  విద్యను అందించే గురువును ఎంత ప్రశంసించినా తక్కువే.  విజ్ఞానాన్ని అందించి విద్యార్థుల జీవితాల్లో వెలుగులను నింపేది ఉపాధ్యాయులే. డాక్టర్, ఇంజనీర్, రైటర్, సైంటిస్టు ఇలా ప్రతి రంగంలో ఉన్న ప్రముఖులందరూ ఒకప్పుడు ఓ గురువు అడుగుజాడల్లో నడిచినవాళ్లే.   ఉపాధ్యాయులు కేవలం సబ్జెక్ట్ విషయాలే కాదు.. క్రమ శిక్షణ, విలువలు, నైతికత, మానవత్వం, ఆత్మవిశ్వాసాలను ఓనమాలతోపాటే నేర్పిస్తారు. అందుకే సమాజానికి అవసరమైన నాలుగు వృత్తుల్లో ఉపాధ్యాయ వృత్తి కూడా ఒకటిగా నిలిచింది. రేపటి తరాన్ని, దేశ భవిష్యత్తును రూపొందించేంది టీచర్లే . అటువంటి టీచర్ల కృషిని  ఉపాధ్యాయ దినోత్సవం రోజును స్మరించుకోవడం విద్యార్థుల ప్రథమ కర్తవ్యం. అందుకే మన దేశంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 5వ తేదీన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం సంప్రదాయం (Teachers Day Essay in Telegu)  అయింది.

టీచర్, ప్రొఫెసర్, లెక్చరర్, సార్, మాస్టర్, కోచ్, ట్రైనర్, పండిట్ ఎలా పిలిచినా ఒక విషయాన్ని నేర్పించిన వాళ్లు, బోధించే వాళ్లు గురువులవుతారు. అన్ని బంధాల్లోకంటే టీచర్, విద్యార్థి బంధం చాలా భిన్నమైనది. ఎందుకంటే ఇద్దరి మధ్య ఎటువంటి రక్త సంబంధం ఉండదు. పాఠశాలలోని తరగతి  గదిలోనే వారి బంధం మొదలవుతుంది. ఒకప్పుడు గురువంటే విద్యార్థుల్లో భయం ఉండేది. భక్తి ఉండేది. ఇప్పుడు భయం స్థానంలో స్నేహం ఉంటుంది. ఒక టీచర్.. తన ప్రియమైన విద్యార్థితో ఫ్రెండ్‌లాగేనే వ్యవహరిస్తున్నాడు. చదువే కాదు.. ఆటలు, పాటలు కూడా నేర్పిస్తున్నారు. విద్యార్థులతో కలసి ఆడుతున్నారు, పాడుతున్నారు. టెక్ట్స్ బుక్స్‌లో సబ్జెక్ట్‌ని మెకానికల్‌గా కాకుండా అర్థమయ్యే విధంగా సింపుల్‌గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల్లో ఉండే ప్రతిభను బయటకు తీస్తున్నారు. ఏ విద్యార్థికి ఏ విషయంలో టాలెంట్ ఉందో గుర్తిస్తున్నారు. చదువుతో పాటు తమకు నచ్చిన రంగాల్లో కూడా రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. అందుకే కాలంతో పాటు గురు, శిష్యుల బంధం కూడా ట్రెండీగా మారింది.
దీంతో విద్యార్థులు కూడా తమ ఉపాధ్యాయుల పట్ల అమితమైన ప్రేమను పెంచుకుంటున్నారు.

సాఫ్ట్‌వేర్ నుంచి సినిమా స్టార్ వరకూ ప్రతి ఒక్కరూ తమకు అక్షరాలు నేర్పించిన టీచర్లను మరువలేరు. వ్యక్తి ఎంత ఎదిగినా దానికి పునాది వేసేది కచ్చితంగా టీచర్లే. వారి ఇచ్చే అక్షర జ్ఞానం, వారందించే అవగాహన, లోతైన విశ్లేషణ, చెప్పే మాట, తిట్టే తిట్లు అన్ని విద్యార్థి మంచి కోసమే. ఉపాధ్యాయులు రెండు మొట్టికాయలు వేసినా, తిట్టినా,  అలిగినా, మాట్లాడకపోయినా అందులో విద్యార్థి శ్రేయస్సు దాగి ఉంటుంది. క్లాస్ రూముల్లో అల్లరి చేస్తే ఉపాధ్యాయులు కోప్పడుతుంటారు. ఆ క్షణంలో టీచర్లు రాక్షసులుగా కనిపిస్తారు. కానీ అంత కచ్చితంగా, కఠినంగా టీచర్లు ఎందుకున్నారో.. ప్రతి వ్యక్తి ఎదిగిన తర్వాత కచ్చితంగా తెలుస్తుంది. వారి తిట్లే వారి దీవెనలని ప్రతి వ్యక్తి రియలైజ్ అవ్వకుండా ఉండరు.

అటువంటి గొప్ప అధ్యాపక వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులను సత్కరించుకోవడానికి  భారత రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 5 టీచర్స్ డే (Teachers Day Essay in Telegu)  జరుపుకుంటున్నాం.  ప్రతి ఏటలాగే ఈ ఏడాది కూడా టీచర్స్ డే వచ్చేసింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులపై తమకున్న ప్రేమను, గౌరవాన్ని రకరకాలుగా వ్యక్తపరుస్తుంటారు.  ఉపాధ్యాయులను సత్కరించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మీకోసం ఇక్కడ కొన్ని మార్గాలను అందిస్తున్నాం.

ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం...

విద్యార్థులు తమ ఫేవరేట్ టీచర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడానికి ప్రయత్నించవచ్చు. దీనికోసం ఆయనపై ఒక కవితను లేదా పాటను రాసి ఆయనకు వినిపించవచ్చు. లేదా ఒక లేఖను రాసి అది వారికి బహుమతిగా ఇవ్వవచ్చు. దీంతో తమ విద్యార్థుల టాలెంట్‌ను చూసి ఉపాధ్యాయులు చాలా ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంది.

నేరుగా వెళ్లి కొంతసేపు టీచర్‌తో మాట్లాడడం...

టీచర్స్ డే రోజు మీకు ఇష్టమైన టీచర్‌తో కాసేపు మాట్లాడానికి ప్రయత్నించండి.  మీ జీవితం, కెరీర్ నిర్ణయాలపై వారి ప్రభావం ఎలా ఉందో? వారితో చెప్పండి.  మీ గురించి, మీ గత జీవితం గురించి ఒక ఫ్రెండ్‌లా షేర్ చేసుకోండి.  మీ ప్రేమను, గౌరవాన్ని తెలియజేయండి.  దాంతో మీ టీచర్ మీ గురించి మరింత తెలుసుకుంటారు. లైఫ్‌లో మీకు ఏం కావాలో? అర్థం చేసుకుని ఆ విధంగా గైడెన్స్ అందించే ఛాన్స్ ఉంది.

తల్లిదండ్రులకు పరిచయం చేయండి...

టీచర్స్ డే రోజున మీ తల్లిదండ్రులకు పాఠశాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించండి. మీ ఫేవరేట్ టీచర్‌ను వారికి పరిచయం చేయండి. మీ టీచర్ ప్రత్యేకతలను మీ తల్లిదండ్రులకు తెలియజేయండి.  మీ టీచర్ ఇష్టపడే దేనైన్నా (Teachers Day Gift) వారికి ఇవ్వండి.

సోషల్ మీడియాలో వీడియో...

మీ టీచర్‌కి సోషల్ మీడియాలో  కృతజ్ఞతలు తెలుపుతూ వీడియోలను రూపొందించండి.  ఆ వీడియో ద్వారా మీ లైఫ్‌లో మీ టీచర్ ఎంత ముఖ్యమో తెలియజేయండి. తోటి విద్యార్థులకు టీచర్ల ప్రాముఖ్యతను తెలియజేయండి.

పెన్, బుక్, మంచి పుస్తకాన్ని మీ టీచర్‌కు మంచి గిఫ్ట్‌గా అందించండి.


తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం College dekhoని ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/teachers-day-essay-in-telugu/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top