తెలుగులో ఉగాది పండుగ విశిష్టత (Ugadi Festival in Telugu) :
ఉగాది.. అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు పండుగ. ఉగాది పండుగ (Ugadi Festival in Telugu)
నుంచే మన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. కనుక ఇది తెలుగువారికి మొదటి పండుగ. సృష్టి ప్రారంభమైన దినమే ఉగాది అనే నమ్మకం. ఉగ అంటే నక్షత్ర గమనం, నక్షత్రగమనానికి ఆది.. అందుకే ఉగాది అంటుంటారు. ఉగాది పండుగను.. తెలుగువారు ఒక సంబరంగా జరుపుకుంటుంటారు. ఈ పండుగ సందర్భంగా ఇళ్లను శుభ్రంగా చేసుకుంటారు. తోరణాలతో అలకరించుకుంటారు. ఇంటి ముందు ముగ్గులు, తలంటు స్నానాలు, కొత్త బట్టలు ధరించి.. ఉగాదిని ఆహ్లాదంగా జరుపుకుంటారు.ఈ పండుగ రోజున ఆరు రుచులుతో కూడిన పచ్చడి చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. తమ భవిష్యత్తు ఆనందంగా సాగాలని కోరుకుంటూ ఉగాది పచ్చడి తింటుంటారు. తీపి, ఉప్పు, చేదు, పులుపు, వగరు, కారం ఇలా ఆరు రుచులు ఉండేలా ఈ పచ్చడిని తయారు చేస్తారు.
ఉగాది పండుగ వేళ ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రవణం చేస్తారు. ఆరోజున అందరూ తమ రాశులను బట్టి.. ఏడాదంతా ఎలా ఉండబోతుందో తెలుసుకుంటారు. అలాగే సాహితీవేత్తలు కవి సమ్మేళనం నిర్వహిస్తారు.
ఉగాది పచ్చడి ప్రత్యేకతలు..
ఉగాది పచ్చడి మాటున.. పెద్ద ఫిలాసఫీ దాగుందని పెద్దలు చెబుతుంటారు. ఉగాది రోజును ఈ ఆరు రుచులున్న పచ్చడిని తింటే ఆ రుచుల్లాగే.. ఆయా రకాల అనుభవాలతో మన జీవితం ఉంటుందంటుంటారు. అలాగే ఆరు రుచులను మనుషుల్లో ఉండే ఆరు ఉద్వేగాలుగా చెబుతారు. మరోవైపు ఇలా ఆరు రుచుల ఆహారాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయుర్వేదం చెబుతుంది.1. తీపి: తీపిని ఆనందానికి ప్రతీక. ఏడాదంతా ఆనందంగా ఉండాలని ఈ రుచి ద్వారా సూచించడం జరుగుతుంది. ఇక తీపి తినడం వల్ల శరీరంలోని వాత, పిత్త దోషాలను సమం చేస్తుంది. తియ్యటి పదార్థాలు తినడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందని, శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. అయితే దీనిని తక్కువగా తీసుకోవాలి. లేదంటే కఫం పెరుగుతుంది.
2. పులుపు: నేర్పుకు ప్రతీకగా చూస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేర్పుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రుచిని చూడాలంటతారు. ఇక ఆహారంలో పులుపును భాగం చేసుకోవడం వల్ల వాత దోషాలను తగ్గిస్తుంది. ఆకలి పెరుగుతుంది. అదేవిధంగా జీర్ణ సమస్యలు ఉండవు. అయితే పులుపు కూడా పరిమితంగానే తీసుకోవడం మంచిది.
3.ఉప్పు: జీవితంలో ఉత్సాహానికి సంకేతంగా ఉప్పును చూస్తారు. ఇక ఉప్పు ఉన్న ఆహ్వారాలను తీసుకోవడం వల్ల వాత దోషం తగ్గుతుంది. అలాగే జీర్ణ శక్తి పెరుగుతుంది. కానీ ఎక్కువైతే పిత్త, కఫ దోషాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఉప్పు కూడా మితంగానే తీసుకోవాలి.
4.కారం: కోపానికి, సహనం కోల్పోయే పరిస్థితికి చిహ్నంగా చూస్తారు. మనుషులు ఇలాంటి ఉద్వేగాలకు గురికావడం సహజమే కదా.ఇక కారంతో కూడిన ఆహ్వారాల వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఆకలి పెరుగుతుంది. రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది. కానీ ఎక్కువగా తీసుకుంటే పిత్తదోషం పెరుగుతుంది.
5.చేదు: చేదును బాధ కలిగించే అనుభవాలకు సంకేతంగా భావిస్తారు. బాధలు కూడా జీవితంలో భాగమేనని చాటి చెప్పడానికే చేదును పచ్చడిలో భాగం చేస్తారు. ఇక చేదుగా ఉన్న ఆహారం తినడం వల్ల శరీరాంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రపరుడుతుంది. పిత్త,కఫ దోషాలు తగ్గుతాయి. చేదుగా ఉన్న పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకున్న సమస్యలు రావు.
6.వగరు: కొత్త సవాళ్లకు చిహ్నంగా వగరును చూస్తారు. బతుకుబాటలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలని చెప్పడానికి సంకేతంగా ఈ రుచిని పచ్చడిలో భాగం చేస్తారు. ఇక వగురుగా ఉన్న పదార్థాలు నిత్యం తినాలంటారు. పిత్త దోషం ఉన్న వారికి వగరుగా ఉన్న పదార్థాలు ఎంతో మేలు చేస్తాయి. కానీ వీటిని కూడా తక్కువగానే తీసుకోవడం మంచిది. లేదంటే గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. ప్రతిరోజూ ఈ ఆరు రుచుల్లో ఏవో రెండు రుచులు కలిగిన ఆహారాలను ఎంచుకుని తింటే మంచిది.
ఇతర రాష్ట్రాల్లో ఉగాది వైభవం..
ఇక ఉగాది పండుగ తెలుగు వారికి ప్రత్యేకమైన పండుగే. కానీ ఈ పండుగను ఇతర రాష్ట్ర ప్రజలు కూడా జరుపుకుంటారు. చైత్రశుద్ధ పాడ్యమి నాడే మరాఠీలు ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను వారు గుడి పడ్వాగా వ్యవహరిస్తారు. మరాఠీలు కూడా ఉగాది రోజునే తమ కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని విశ్వసిస్తారు. గుడి అంటే జెండా అని అర్థం. గుడి పడ్వా రోజున ప్రతి ఇంటి ముందూ ఒక వెదురు కర్రని ఉంచి.. దానిని వేప, మామిడి ఆకులు పూలతో అలంకరిస్తారు. ఆ కర్ర మీద ఇత్తడి, రాగి, వెండి వంటి లోహాంతో చేసిన చెంబును బోర్లిస్తారు.
తమిళులు కూడా ఉగాదిని జరుపుకుంటారు. వీళ్లు ఉగాదిని 'పుత్తాండు' అంటారు. మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖీ, బెంగాలీలు పోయ్ లా బైశాఖ్ గా జరుపుకుంటారు. కన్నడ వాళ్లు కూడా ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. అక్కడ సంప్రదాయమైన పద్ధతులన్ని దాదాపుగా తెలుగు రాష్ట్రాలను పోలి ఉంటాయి.
సిమిలర్ ఆర్టికల్స్
నవంబర్ 14 బాలల దినోత్సవం స్పీచ్ తెలుగులో (Children's Day Speech in Telugu)
సంక్రాంతి పండుగ విశేషాలు (Sankranti Festival Essay in Telugu)
ఏపీ 10వ తరగతి రీవాల్యుయేషన్ 2025కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (AP SSC Revaluation 2025)
TS ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్ష తేదీ షీట్ 2025 (TS Intermediate Practical Exam Date Sheet)- తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ డేట్ షీట్‌ని తనిఖీ చేయండి
ఇంటర్మీడియట్ తర్వాత భారత ఎయిర్ ఫోర్స్ లోకి ఎలా చేరాలి? (How to Get into the Indian Air Force after Intermediate?)
ఉపాధ్యాయ దినోత్సవ గొప్పతనం, (Teachers Day Essay in Telugu) విశిష్టతలను ఇక్కడ తెలుసుకోండి