సెప్టెంబర్ 9న, 2024 ఈ జిల్లాలో పాఠశాలలకు సెలవులు (School Holiday Due to Rain 9 September 2024) :
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీ, తెలంగాణాలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇందులో భాగంగా పలు జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించడం జరిగింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు. భారీ వర్షాలు కారణంగా సోమవారం పలు పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఇస్తూ అధికారులు ప్రకటనలు జారీ చేశారు. విజయవాడలోని సింగ్‌నగర్, రాజీవ్ నగర్, కేసరపల్లి, రాజరాజేశ్వరి పేట తదితర ప్రాంతాల్లోని స్కూళ్లకు సెప్టెంబర్ 9 సోమవారం నాడు సెలవు ప్రకటించారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి మరియు ఏలూరు జిల్లాలో పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించారు.
కాగా తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో వాతావరణ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో వరదలు ముంచెత్తే అవకాశం ఉన్న తీర ప్రాంతాల్లోని ప్రజలు సురక్షితంగా ఉండాలని అధికారులు తెలిపారు. గోదావరి జిల్లాలో పాఠశాలల సెలవులను అధికారులు ఇంకా విడుదల చేయ లేదు.
తెలంగాణలోనూ కురుస్తోన్న వర్షాలు..
అల్ప పీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి సహా 19 జిల్లాలకు తీవ్ర వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ వంటి పలు ప్రాంతాల్లో కూడా వానలు కురుస్తోన్నాయి. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో మున్నేరు నది పొంగి ప్రవహిస్తుండటంతో బాధితుల కోసం అధికారులు పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ జిల్లాల్లో పాఠశాలలు మూసివేసే అవకాశం ఉంది.తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.