TSPSC 2024 గ్రూప్ 2 పరీక్ష వాయిదా (TSPSC Group 2 Exam Postponed 2024) : తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల డిమాండ్‌ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు వచ్చే నెల ఆగస్ట్ 7, 8 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వచ్చే డిసెంబర్‌లో జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే కొత్త తేదీలను TGPSC త్వరలో ప్రకటించనుంది. నిజానికి తెలంగాణ డీఎస్సీ పరీక్షకు, TSPSC గ్రూప్ 2కి మధ్య కేవలం వారం రోజులు మాత్రమే గ్యాప్ ఉంది. దీంతో అభ్యర్థులు TSPSC గ్రూప్ 2ని వాయిదా వేయాల్సిందిగా కోరారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు. వారి డిమాండ్‌ను పరిశీలించిన ప్రభుత్వం వాయిదా ప్రకటన చేసింది.
మళ్లీ.. మళ్లీ వాయిదా..
అయితే TSPSC గ్రూప్ 2 ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. గత ఏడాది 783 పోస్టులతో TSPSC గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన రిలీజ్ అయింది. ఇందులో భాగంగా గత సంవత్సరం అంటే 2023 జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 16 వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం 5.51 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అనంతరం గతేడాది ఆగస్ట్ 29, 30న గ్రూప్ - 2 పరీక్ష నిర్వహిస్తామని అయితే దీంతో ఆగస్టు 29, 30న, 2023లోనే గ్రూప్-2 పరీక్ష నిర్వహిస్తామని TSPSC వెల్లడించింది. అయితే వరుసగా గ్రూప్-1, 4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు అప్పుడు కూడా డిమాండ్ చేశారు. దీంతో పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూలు చేసింది.
అయితే నవంబర్ 3వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూలు చేసింది. కానీ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ కొత్త తేదీలను ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు ఉంటాయని మార్చి నెలలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరోసారి ప్రకటన చేసింది. మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు పూర్తైన వెంటనే గ్రూప్-2 పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమకు కొంత గడువు కావాలని ఉద్యోగార్థులు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం TSPSC గ్రూప్ 2ను వాయిదా వేయక తప్పలేదు.